నేను… రామచంద్ర … మా ఇద్దరికీ బాగా పాడతామేమో అనే భ్రమ ఉండేది స్కూలు రోజుల్లో. ఏడవ తరగతి annual పోటీలలో పాటలు కూడా ఉన్నాయని తెలిసి ఇద్దరం రియాజ్ మొదలెట్టాము (ఔను మరి… ఒకరేమో పండిట్ భీమసేన్ జోషి… ఇంకోరు.. ఉస్తాద్ నస్రత్ ఫతే అలీ ఖాన్. కదా!) ఓ రోజు క్లాసు టీచర్ రాలేదని ఆ సమయం లో అల్లరి చేయకుండా ఉండడానికి అనసూయ మేడం వచ్చి క్లాసు లో కూర్చున్నారు. ఊరకే ఉండడం ఎందుకని, ఎవరైనా పాటలు పాడండి అని మేడం అడిగారు. జంట గాయకులు గప్చుప్ గా ఉన్నా, మా రియాజ్ చూసిన క్లాసు మేట్స్ మేడం కి మా గురించి ఉప్పందించారు. ఇంకేముంది.. ఇద్దరిలో ఎవరైనా పాట పాడండి అన్నది మేడం చిద్విలాసం గ. ఇద్దరం ‘తను ముందు పాడితే నేను పాడతానని’ భీష్మించుకు కూర్చున్నాం. ఇంకేముంది… సరిహద్దు సమస్య లాగ.. ఓ పది నిమిషాలు నానాయి. అందరి ప్రోద్బలంతో చివరికి, ఇద్దరూ కోరస్ గా పాడడానికి ఒప్పుకున్నాము. ( ఆ క్షణం లో రామచంద్ర చేస్తున్న కుట్ర గురించి నాకేమి తెలుసు?…) శ్రోతలందరికీ ముందే చెప్పాము అప్పుడు గురునాథ టాకీసు లో నడుస్తున్న “సిరి సిరి మువ్వ” చిత్రం లోని ” రా .. దిగి .. రా…” అనే పాట పాడబోతున్నామని… లేకుంటే వాళ్ళు ఏ పాట అని గుర్తించక పోతే కష్టం కదా..?
ఇద్దరం గళం సర్దుకున్నాం… చాల ఎక్కువ స్థాయి లో మొదలయ్యే పాట అది.. ఐ. ఎన్. ఎస్ విక్రాంత్ నుండి జువ్వున నింగి కెగేసే యుద్ధ విమానాల్లాగా… ఇద్దరి స్వరాలూ “రా. దిగి.. రా…” అంటూ టేక్- అఫ్ అయ్యాయి.. నేను భయం తో కళ్ళు మూసుకున్నాను… గొంతు మాత్రం మనసు ఇచ్చిన ధైర్యం తో పాడుతోంది.. ఇంతలో ఏదో తేడా… కాని ఆ తేడా ఏంటా అని అప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలెడితే.. పాట మరిచిపోతే.. అంత పరాభవం ఇంకోటి ఉండదు.. అంతే గుండె చిక్కపట్టుకుని పాట కంటిన్యూ చేశాను.. ఒక చరణం అయ్యాక అర్థమయ్యింది.. దుష్టుడు రామచంద్ర పాడటం ఆపేసాడని… “అమ్మ… నమ్మక ద్రోహీ ..” అంటూ ఘోషించింది హృదయం.. కానీ యుద్ధ భూమి లో సగం దూరం వెళ్ళిపోయిన సైనికుడికి ఎదురయ్యే మీమాంస.. ఇలాంటి ఎమోషన్స్ ముప్పిరిగొంటుంటే… అసలే ఆ పాట చివర్లో లిరిక్స్ చాల ఫాస్ట్ గా పాడాల్సి ఉంటుంది.. ఇప్పుడు… ఆగితే కష్టం అని పాటని ముందుకు తీసికెళ్ళి పోయాను… “నటరాజ శతత హస్ర రవి తేజా… నట గాయక వైతాళిక ముని జన…” ఇలా సాగుతుందీ పాట.. ఎలా పాడేసానో… పాడేసాను…
పాట అయిపొయింది.. కళ్ళు ఇంకా అంధకారం లోనే కొట్టు మిట్టాడు తున్నాయి. చెవులకు ఏమీ వినపడటం లేదు.. అంత నిశ్శబ్దం… కొంప తీసి అందరూ మూర్చ పోయారేమో.. అని బెరుగ్గా కళ్ళు తెరిచాను..క్లాసంతా నా వైపే చూస్తూ ఉంది.. అంతే.. చప్పట్లు మోగాయి.. అది పాట అయిపోయినందుకు ఆనందమో… లేక కష్టమైన పాట పాడానని మోదమో తెలియదు.. పక్కన నమ్మక ద్రోహి రామచంద్ర నా వైపు నవ్వుతూ చూస్తుంటే… కొర కొరా చూసాను.. క్లాసు బయట కొచ్చాక తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి.. ఎనిమి గా declare చేసేసాను.. కొన్ని రోజులు మాట్లాడ లేదు తనతో.. ఇప్పటికీ ఆ పాట గురించి ఇద్దరం తలుచుకుని పగలబడి నవ్వని సందర్భం లేదు..!