అప్పట్లో దొరికే తినుబండారాలు

కొన్ని అనుభూతులు… తలచుకుంటే ఏదో అనిర్వచనీయమైన ఆనందాన్నిస్తాయి. మన స్కూలు రోజుల్లో… కొన్ని ట్రేడ్ మార్క్ జ్ఞాపకాలు అందరికి గుర్తుండేవి ఈ రోజు మీతో వాటిని పంచుకోవాలన్పిస్తోంది.

కమ్మర్ కట్
ఇది ఆ కాలం లోనే అత్యంత చవకైన తినే ఐటెం . కేవలం ఒక పైసా కి ఒకటి దొరికేది. ఇది కొంచం బెల్లం పాకంలా ఉండేది. ఎవరికైనా ఏదైనా కొనివ్వాలి అంటే… ” నీకో కమ్మర్ కట్ కొనిస్తాలేరా..” అని ఏడిపించే వాళ్ళం. ఇంటర్వల్ లో స్కూలు బయట దొరికేది.

పాల ఐస్
ఓ తోపుడు బండిలో పాల ఐస్ క్రీమ్ని ఉంచి తోసుకుంటూ కొంత మంది అమ్మే వాళ్ళు. ఓ స్టిక్ పై తెల్లటి ఆకారం లో స్థూపాకారం లో ఉండేదీ ఐస్. ఈ ఐస్ అమ్మే వాళ్ళల్లో .. ఓ వ్యక్తి నాకు ఇప్పటికీ  గుర్తే.. పొడువాటి జుట్టు తో , “ఐస్ … పాలైసు…” అంటూ తనలో తనే గోనుక్కున్టున్నట్లుగా  వెళ్తూ, ఐస్ అమ్మే వాడు. తను మెంటల్ గా స్టేబుల్ గ లేకున్నా.. వ్యాపారం మాత్రం నిబద్ధతతో  చేసేవాడు. ఆ ఐస్ వెల పది పైసలు ఉండేది. కాస్త ఖరీదు అనిపిస్తే.. ఐదు పైసలకు సేమ్యా ఐస్ దొరికేది. నాకు మాత్రం నచ్చేది కాదు.

బొచ్చు మిఠాయి
సాయంత్రం పూట ఇంట్లో హోం వర్క్ (పొరపాటున…) చేస్తుంటే … దూరం నుండి గంటల సవ్వడి వినిపించేది. ఓ తోపుడు బండి పై బెల్ ఆకారం లో ఉన్న ఓ పెద్ద గ్లాస్ జార్ లో బొచ్చు మిఠాయి పెట్టి గంట మోగిస్తూ వీధి వీధి తిరిగి అమ్మేవారు. ఇది బేసిక్ గా  crumbled  సోంపపిడి. ఐదు లేక పది పైసలకు పేపర్ లో చుట్టి ఇచ్చేవాళ్ళు. వీధి లో ఆ గంటల సవ్వడి వినగానే.. పిల్లలంతా చుట్టూ మూగేసేవారు.

ఇవి కాకుండా.. స్కూలు దగ్గర.. భూచక్ర గడ్డలు, చీమ చింత కాయలు సీసనల్ గ అమ్మేవారు. చీమ చింతకాయలు ఆకు పచ్చగా ఉండేవి. ఎందుకో అవి ఎవరైనా తింటుంటే వచ్చే వాసన నాకు నచ్చేది కాదు. వేయించిన చనిక్కాయలు (groundnuts) కూడా దొరికేవి.
సైకిల్ పై తిరుగుతూ.. పింక్ కలర్ లో క్లే లాగ అనిపించే ఓ స్వీట్ ఐటెం అమ్మే వారు. ఇందులో ప్రత్యేకత  ఏంటంటే.. ఆ క్లే ని చుట్టలు గా చుట్టి.. మన చేతి కి వాచీ లాగ చుట్టి ఇచ్చేవారు. దాన్ని అలాగే నాకుతూ, చప్పరిస్తూ… కేరింతలు కొట్టేవారు.

కొంచం ఖరీదైన వాళ్ళైతే.. అమ్ప్రో biscuits , మిల్క్ బికీస్ కాని అప్పుడప్పుడు తినేవాళ్ళు. ఇంకా ఖరీదైతే .. మన వూరికి పుల్లారెడ్డి అనదగ్గ ‘ఆర్కాట్ స్వీట్ స్టాల్” లో స్వీట్స్ తినే వాళ్ళం.

This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

11 Responses to అప్పట్లో దొరికే తినుబండారాలు

  1. chinni says:

    కమ్మర్ కట్ మేము కొనుక్కుని తినేవాళ్ళం ..జీడిలపాకం లానే ఉండేయి .తాటి చెక్కలు ,భూచక్ర గడ్డ ,తాటి తాండ్ర మన స్కూల్ దగ్గరే పరిచయం . పిండి వంటలకి బెల్లం పాకం తాయారు చేసినప్పుడల్లా గుర్తు చేసుకుంటాం కాస్త గట్టిపడితే ‘కమ్మర్కాట్’తయరవుతదని …మీ జ్ఞాపకాలు చాలా ఫ్రెష్ గా వున్నాయి .

  2. SHANKAR says:

    ” పింక్ కలర్ లో క్లే లాగ అనిపించే ఓ స్వీట్ ఐటెం అమ్మే వారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. ఆ క్లే ని చుట్టలు గా చుట్టి.. మన చేతి కి వాచీ లాగ చుట్టి ఇచ్చేవారు. దాన్ని అలాగే నాకుతూ, చప్పరిస్తూ… కేరింతలు కొట్టేవారు.”

    భలే ఉండేదండీ అది. మాది తూగోజీ. మా స్కూల్ దగ్గర వాచీ, కోతిబొమ్మ, బాతు (పది పైసలు, పావలా మేగ్జిమం అంతే) చేయించుకుని తినడం గుర్తొచ్చింది. చక చకా అతను చేసి ఇస్తుంటే ఆ చేతి కదలికలే అబ్బురం గా అనిపించేవి.

    నిజమే సేమ్యా ఐస్ అంత బావుండేది కాదు. పాల ఐస్ రుచి మాత్రం తలచుకుంటే కేకో కేక.

    కమ్మర్ కట్, భూచక్ర గడ్డలు మా ఏరియాలో, టైం లో లేవేమో

    మాకు గోల్డ్ స్పాట్ చాక్లెట్లు, ఉప్పు కారం అద్దిన మావిడి కాయ ముక్కలు, ఊరబెట్టిన పెద్ద ఉసిరికాయలు, అర్ధ రూపాయకి జేబునిండా వచ్చే చిన్న ఉసిరికాయలు, మావిడి, తాటి తాండ్ర, కలర్ సోడా, పిప్పరమెంట్లు, పాపిన్స్, వేరు శనగ ఉండలు, కొబ్బరుండలు ఇవన్నీ అప్పట్లో లగ్జరీలే (ఇంట్లో ఇచ్చే పావలా పాకెట్ మనీకి 😦 ). దాచుకుని దాచుకుని కొనుక్కునే వాళ్ళం.

    మంచి జ్ఞాపకాలను తట్టి లేపారు. మీకు ధన్యవాదాలు

    • mhsgreamspet says:

      చిన్ని గారు
      భూచక్ర గడ్డలు మీరు గుర్తు తెచ్చిన ఐటెం అండీ. షేప్ గుర్తుంది కాని పేరు మరిచాను. మీరు, సిస్టర్స్ బాగా గుర్తు పెట్టుకుని చెప్పినందుకు మీ అందరికి థాంక్స్
      శంకర్ గారు
      నేను మరిచిన ఐటెం లు చాల వాటిని గుర్తు చేసారు..ధన్యవాదాలు. భౌగోళికంగా, జీవన గతిలో ఎంతో వైరుధ్యమున్నా , మన అందరిని ఒకే దారంతో కలిపేవి ఈ చిన్ని చిన్ని సంతోషాలే కదండీ..

  3. SIVARAMAPRASAD KAPPAGANTU says:

    భలే జ్ఞాపకాలు గుర్తు చేసారు. మా చిన్నప్పుడు విజయవాడలో, 1967-72 మధ్య మా స్కూల్ (ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం హైస్కూల్, సత్యనారాయణ పురం) లో చదువుకునే రోజుల్లో మా స్కూల్ ముందు ఒక డ్రింకు బండి ఉండేది. అతని పేరు శ్రీరాములు. ఐస్ చిత్రికపట్టి, రంగునీళ్ళు, నానేసిన సబ్జా గింజలు కలిపి భలే డ్రింకు ఇచ్చేవాడు. తాగటానికి గాజు గొట్టం కూడా ఇచ్చేవాడు. అలాగే మస్తాన్ బండి ఉండేది. అతను కొబ్బరి చిప్పలో మిక్చర్ చేసేవాడు. ఆ రుచి ఇప్పటికీ నాలిక మీద కదులుతుంది. వాళ్ళబ్బాయి ఖాసీం నా ఫ్రెండ్. ఇప్పుడు ఎక్కడున్నాడో కదా. ఇక ఐస్ ఫ్రూట్లల్లో మొదటి మార్కు పెద్ద పెద్ద ఫ్లాస్కుల్లో అమ్మే రంగువె భలే రుచిగా ఉండేవి. ఆ తరువాత సగ్గు బియ్యం అద్దిన ఐస్ ఫ్రూట్ లు వచ్చాయి. అవి నాని చిత్రమైన రుచి వచ్చేది. ఆపైన సీజన్లో ఉప్పూ కారం అద్దిన మామిడికాయ ముక్కలు, జామకాయలు, ముఖ్యంగా రేగుపళ్ళు. ఇలా వ్రాసుకుంటూ పొతే ఒక వ్యాస్యం అయ్యేట్టుగా ఉన్నది.

    మంచి కాలం మళ్ళి నెమరువేసుకునే అవకాసం ఇచ్చారు. మీ వ్యాసం చూసాకే గుర్తొచ్చాయి, ఈ జ్ఞాపకాలన్నీ నా దగ్గరే ఉన్నాయా అని ఆశ్చర్యపోయాను.ధన్యవాదాలు

  4. Srinivas says:

    పింక్ కలర్ లో క్లే లాగ అనిపించే ఓ స్వీట్ ఐటెం అమ్మే వారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. ఆ క్లే ని చుట్టలు గా చుట్టి.. మన చేతి కి వాచీ లాగ చుట్టి ఇచ్చేవారు.
    దీన్ని మా తెలంగాణ ప్రాంతంలో బొంబాయి మిఠాయి అంటారండి బాబు.

    • mhsgreamspet says:

      శ్రీనివాస్ గారు
      మేము అదే పేరు తో పిలిచే వారమని అనిపిస్తోంది. థాంక్స్ అండీ.
      శివరామ ప్రసాద్ గారు..
      బోలెడు తినుబండారాల గురించి చెప్పేరు. మీరు ఓ టపాలో మా అందరితో మరిన్ని విశేషాలు పోంచుకోగాలరని ఆకాంక్షిస్తూ
      రామకృష్ణ

  5. Swathi says:

    ఇంకా ఉసిరికాయలు కూడా దొరికేవండి.చిన్న ఉసిరికాయలు కొనుక్కుని అందులో ఉప్పు,కారం నంచుకుని తింటూ స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అబ్బా ఆ మాజానే వేరుగా ఉండేది.

  6. Lakshmi says:

    భలే జ్ఞాపకాలు గుర్తు చేసారు.

  7. ennela says:

    baagundadee…bombayi mitaayi gurinchi nenu wraasaanu oka saari. yee kinda post choodandi.
    http://ennela-ennela.blogspot.com/2010/12/blog-post_23.html
    Thanks

  8. Dear jns, probably u forgot 2 mention about cool drinks with different kinds of colours mixed with ice pieces used2 sell in front of our school.we use2 drink it by searching 4 pet sir2escape punishment4m him.

  9. బి వి లక్ష్మీనారాయణ says:

    పీచు మిఠాయి…..కమ్మరకడ్డీలు,,జీళ్ళూ,,,బొరుగుండలూ,,,పుల్లయిసూ

Leave a reply to Musalagari.Prasannakumar. Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.