విశ్వనాధ్ చిత్రాలలో హాస్యం

మొన్నో రోజు ఒకతను వాళ్ళ అబ్బాయి కి ఓ స్కూల్లో అతి కష్టం మీద అడ్మిషన్ సాధించాడు.. ఎలా అని అడిగితే… “ఏముంది… స్వాతి ముత్యం లో కమల్ హసన్ లాగా.. ప్రిన్సిపాల్ ని విడవనే లేదు.. అడ్మిషన్ వచ్చేసింది..” అన్నాడు నవ్వుతూ… సోమయాజుల్ని వదలకుండా విసిగించి… ఓ గుడి లో గార్డు ఉద్యోగం సంపాదించే కమల్ హసన్ గుర్తొచ్చి… విషయం అర్థమై నేనూ నవ్వాను.

ఆ తరవాత ఓ సారి సింహావలోకనం చేసుకుంటే.. అనిపించింది.. విశ్వనాధ్ చిత్రాలు అంటే గుర్తొచ్చేది  సంగీతం.. సంప్రదాయం.. సంసృతి..  ఇవే కాదు…  తన చిత్రాలలో సునిశిత హాస్యం కూడా ఉంటుంది… ఆ రసానికి కూడా ఓ ప్రత్యేక స్థానం ఉంది అని. ముఖ్యంగా హాస్యానికి ఓ సెపరేట్ ట్రాక్ ఉండదు తన చిత్రాలలో. అలాగే వెకిలి హాస్యం కూడా ఉండదు. అవసరమైతే ప్రధాన  పాత్రల ద్వారా కూడా (సాగర సంగమం , స్వాతి ముత్యం చిత్రాలలో కమల్ హసన్ హాస్యాన్ని కూడా సందర్భోచితం గా పండించారు)  హాస్యాన్ని చేయిస్తారు. శుభలేఖ సినిమా లో ప్రతి నాయకుడు సత్యనారాయణ ద్వారా కూడా కట్నం పై అతడిని ప్రొజెక్ట్ చేయటానికి హాస్యాన్నే మాధ్యమం గా తీసుకున్నారు. హాస్యం ఎక్కడా  కృతకం గా ఉండదు… కథలో ఓ భాగంగానే కనిపిస్తుంది. అలాంటి కొన్ని సినిమాలు ఓ సారి అవలోకిద్దాం.

శంకరాభరణం లో అల్లు రామలింగయ్య , సోమయాజులు మంచి స్నేహితులు. కర్నాటక నుండి కచేరి పెట్టించడానికి శంకర  శాస్త్రి వద్దకు వచ్చిన వారితో కన్నడలో మాట్లాడుతూ, మిత్రుని కచేరి కి ఒప్పించటానికి అల్లు గారు చేసే ప్రయత్నాలు… నవ్వు తెప్పిస్తుంటాయి.. అలాగే “ఆండాళ్ళూ    ..” అంటూ ఓ శిష్యురాలికి శాస్త్రీయ సంగీతాన్ని వక్రీకరిస్తూ నేర్పించే ఓ మిడి మిడి జ్ఞానపు మేస్టారి సన్నివేశం నవ్విస్తూనే… పాశ్చాత్య సంగీత ధోరణులపై చురక వేస్తుంది. “ఏమిటో…. ఈయన పాటే కాదు… మాట కూడా అర్థం కాదు… నీకేమైనా అర్థమైందా   ఆండాళ్ళూ..” అనే మేస్టారి అజ్ఞానం  చూసి పొట్ట చేక్కలవ్వటమే కాదు.. అందులోని సందేశమూ అర్థమౌతుంది.

సాగర సంగమం అంటూనే.. గుర్తొచ్చేది.. ఫోటోలు. ఎవరైనా… ఫోటో లు సరిగ్గా తీయకుంటే.. “ఏమిటి సాగర సంగమం ఫోటో లు తీసారు” అని అనటం పరిపాటి అయిపొయింది. “ఓ భంగిమ పెడతాను..” అంటూనే “అదేదో త్వరగా పెట్టు బాబు.. బాగా ఆకలౌతోంది” అనే తిండిపోతు కుర్ర ఫోతోగ్రఫెర్ మనకి ఇంకా గుర్తుండే ఉంటారు. “వేవేల గోపెమ్మలా …” అన్న పాటకు ముందు నృత్య దర్శకుడు ఆ సీన్ ని ఊహించే విధానం… కమల్ హసన్ ఇబ్బంది పడుతూ చేసే నృత్యం… అన్ని నవ్విస్తూనే.. మసాల సినిమాలలో ఉండే నృత్య రీతులను సున్నితంగా ఎండగడుతుంది. . “టూ మిస్టేక్స్ … ” అంటూ మిత్రుడు శరత్ బాబు ఆఫీస్ కెళ్ళి తాగిన మైకం లో కమల్ చేసే వీరంగం నవ్వు తెప్పిస్తూనే.. మిత్రుని పై అతనికున్న అభిమానాన్ని ఆ సన్నివేశం చక్కగా showcase చేస్తుంది.

స్వాతి ముత్యం లో సుత్తి వీరభద్ర రావు, అతని భార్య , కమల్ ఉండే సన్నివేశాలలో హాస్యం చాల బాగుంటుంది. మాటి మాటికి చెరువులో దూకి చస్తాను అనే భార్య, మామ గారిని  “ఆగండి.. ఇద్దరూ ఒకటే ఈతల పోటీలకు వెళ్తున్నారు..” అంటూ విసుక్కునే వీరభద్ర రావు ని చూస్తే నవ్వు రావాల్సిందే..

ఇలా విశ్వనాధ్ గారి ఏ సినిమా చూసినా… అందులో అన్ని రసాలతో పాటు… హాస్యాన్ని కూడా అంతర్లీనం గా చొప్పించడం అద్భుతమనిపిస్తుంది.

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

One Response to విశ్వనాధ్ చిత్రాలలో హాస్యం

  1. subhadra says:

    బాగా చెప్పారు. కధలోని పాత్రలతో అంతర్లీనంగా, సున్నితంగా ఉండే హాస్యం కలకాలం గుర్తుండిపోతుంది, గుర్తొచ్చినప్పుడల్లా గిలిగింతలు పెడుతుంది అని చెప్పడానికి విశ్వనాధ్ గారి హాస్యమే ఒక గొప్ప ఉదాహరణ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s