మా పసలపూడి కథలు, దిగువ గోదారి కథలు, ఆకు పచ్చటి జ్ఞాపకం…. లాంటి పుస్తకాలు గోదారి అందాల్ని, అక్కడి జీవన రీతుల్ని కంటి ముందు అవిష్కరిస్తుంటే.. మనం పుట్టి పెరిగిన జీవన రీతుల కంటే ఓ భిన్నమైన సంస్కృతి, సాహిత్యం, తెలుగు భాష, పద ప్రయోగం చూసి అబ్బురపడేవాడిని… ఆ అబ్బురంతో పాటు… మన సాహితి సంస్కృతి, ఇంకా చెప్పాలంటే పక్క చిత్తూర్ మాండలికం లో మంచి సాహిత్యం లేదేమిటా అని అనిపించేది… కొంత వరకు… పులికంటి కృష్ణా రెడ్డి గారి రచనలు ఆ దాహాన్ని తీర్చినా, మన వూళ్ళో వుండే మాండలీకం లో రచనలు తక్కువనే చెప్పాలి..
ఈ మధ్యనే సూరి బావ ఇంట్లో కే. కే ఇచ్చి వెళ్ళిన “మిట్టూరోడి పుస్తకం” తస్కరించి తెచ్చాను (వంశీ గారు మన క్లాస్ మేట్ స్వర్ణ కి ఇచ్చిన ” మా పసలపూడి కథలు” పట్టుకొచ్చినట్లు :-))… నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు రచయిత.. ఆ కథలు చదువుతుంటే… ముప్పై ఏళ్ళుగా వూరికి చుట్టపు చూపుగా వచ్చిపోతున్న నాకు ఒక్క సారి గా నాటి మన వూరి పిల్ల తెమ్మెరలు ఝంఝా మారుతమై తాకాయి.. ఆ కథలను చదువుతూ వుంటే… మన వూళ్ళో తిరుగాడుతున్న అనుభూతి.. ఇందులోని ప్రతి పాత్రా, రచయిత తో సహా మన భాషే మాట్లాడుతాయి.. అంతే కాదు… మనవ సంబంధాలను ఆ “యాస” లో అందంగా మలిచారు. ఈ భాషని అర్థం చేసుకోవాలంటే… కొంత సమయం పడుతుంది.. కుశాల (తమాషా), వూరిబిండి (చట్నీ), గెనిశి గెడ్డలు (చిలకడ దుంపలు). వారుకున్నాను (బావుకున్నాను), గుడ్డు పోరుటు (ఎగ్ బుజియా) ఇలా ఎన్నో పదాలు…అప్పటి రోజుల్ని గుర్తు తెచ్చాయి..
పచ్చనాకు సాక్షిగా , సినబ్బ కథలు, మిట్టూరోడి కతలు, మునికన్నడి సేద్యం, పల పొడుగు, సుందరమ్మ కొడుకులు అనే ఆరు segments ని కలిపి ప్రచురించిన పుస్తకమే ఈ “మిట్టూరోడి పుస్తకం” … బాపు బొమ్మలతో, ఆ భాషా మధురిమ లో ముంచుతూ అందమైన మానవీయ బంధాలను అందించే రస గుళికలే ఈ కతలు.. కథ వస్తువు పరంగా కొన్ని కథలలో అక్కడక్కడా “మా పసలపూడి కధలు” గుర్తుకు వస్తాయి.
ఇందులోని కొన్ని కథలను ఇక ముందు పరిచయం చేస్తాను.. అంత వరకు ఆ పుస్తకం లోని కథలలోని పద విన్యాసానికి ఓ చిన్నసోదాహరణ తో సరి పెడుతున్నాను
“ఎంతదా నువ్వు ఎగ వీదిలో ఉండి, నీ అమ్మగారు దిగవీదిలో వుంటే మాత్రం …. చట్టిలోకి ఉప్పు గావాలన్నా…. ఈ వీదికి ఎగేస్కుంటా పరిగెత్తితే సరిపాయనా?”
Ramakrishna,the coloquial language reflects in mittoorodi kathalu impress us well.