మేఘమా మెరవకే ఈ క్షణం (కథ పునః ప్రచురణ)


“నీ జ్ఞాపకాలతో

హృదయ సాగర గర్భంలో 
టెక్టోనిక్ పలకలు కదిలి
కళ్ళపై కమ్ముకుందో సునామి
కన్నీరంటే ఇదే సుమీ….”

కాలింగ్ బెల్ మోగింది. ‘ఇప్పుడే కదా గీతిక కాలేజీ కెళ్ళింది. అప్పుడే వెనక్కి వచ్చిందేమిటా’ అని అనుకుంటూ పద్మ వెళ్లి తలుపు తీసింది. బయట వర్షం లో తడుస్తూ, గీతిక కంటే కొంచం చిన్న అమ్మాయి ఉంది. చాల చక్కగా ఉంది. ఎక్కడో చూసినట్టున్నా,.. జ్ఞాపకం రావటం లేదు.

ఏ సబ్బులు అమ్మే అమ్మాయేమో అనుకుంది పద్మ. ప్రశ్నార్థకం గా ఏమిటన్నట్టు చూసిందా అమ్మాయి వైపు.

“నమస్తే ఆంటీ.. మీరు పద్మ గారే కదా…..?” అంటూ తన వైపు చూసిందా అమ్మాయి.

ఎవరో తెలిసిన వారి తాలూకు అమ్మాయి అని అర్థమైంది పద్మకి. ఆ అమ్మాయి ని చూస్తే ఏదో అవ్యక్తమైన ఆనందం కలిగింది పద్మకి.. అవునన్నట్టుగ తల ఊపి “ఎవరి పాపవమ్మా నువ్వు?” అంది ఆప్యాయంగా.

తడిసిన తలని తుడుచుకుంటూ, “నేను వేణుగారని.. మీతో పాటు కాలేజీ లో చదువుకున్న మీ క్లాస్ మేట్ అమ్మాయినండీ..” అంది.

ఒక్క సారి వింటున్నది నిజమా, కాదా అన్న సందిగ్ధత పద్మ కి… వెంటనే తేరుకుని ” వేణు… అంటే… వేణుగోపాల్  పా….ప…. వా…?” అద్భుతం చూస్తున్నట్లుగా అడిగింది పద్మ.

అవునన్నట్టుగా తల ఊపింది ఆ అమ్మాయి.

వేణు పేరు  వినగానే… ఎన్నో జ్ఞాపకాల వలయాలు చుట్టుముట్టాయి పద్మని. ఆ స్మృతుల  తాకిడినుండి తేరుకుంటూ, లోనికి రమ్మని సైగ చేసి, తను ఎందుకొచ్చిందా అన్న ఆలోచనతో ఇంట్లోకి కదిలింది పద్మ. హాల్లో డైనింగ్ టేబుల్ పక్కన కూర్చుని, ఆ అమ్మాయిని కుర్చోమంది పద్మ.

“నాన్న గారు ఎలా ఉన్నారు.. ఎక్కడ ఉన్నారు…నీ పేరేంటి?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది పద్మ

“తను బాగానే ఉన్నారు ఆంటీ… ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాము.. నా పేరు పద్మజ. ఇక్కడ కాలేజీ లో అడ్మిషన్  దొరికింది.  చేరటానికి వచ్చాను. కొత్తగా ఈ వూరు వచ్చాను కదా.. తను ఎప్పుడూ మీ గురించి చెపుతుంటారు.. మీరు ఈ వూళ్ళో వున్నారని.. మిమ్మల్ని చూద్దామని ఇలా వచ్చాను. మీతో మాట్లాడాక  కృష్ణ నది వెళ్లి రావాలి…ఆంటీ ” అంది.

సాలోచనగా చూసింది పద్మ పద్మజ వైపు. డ్రెస్ చాల సింపుల్ గ ఉంది… కాని ముఖం లో ఏదో తెలియని విశ్వాసం… ప్రశాంతత.. వేణు పోలికలు ముఖంలో ఉన్నా… తన లాగా గంభీరంగా ఉండే పిల్ల కాదు అనిపించింది. చేతిలో ఓ హ్యాండ్ బాగ్, ఓ  రాగి కలశం, దానిని చుట్టి ఉన్న ఓ పాత నీలి రంగు బట్ట… అన్నీ బాగున్నా ఆ రాగి కలశం  ఒక్కటే బాగోలేదు అనిపించింది పద్మ కి.

“నాన్నగారు ఏం చేస్తున్నారు..?”

“ఏమీ  చేయటం లేదు ఆంటీ. తాతయ్య సంపాదించినది తింటూ దర్జాగా ఉంటారు.. ఇంటి పనులే కాదు.. ఏ పనీ చేయరు.. కాలేజీలో కూడా అలాగే ఉండేవారా  ఆంటీ…?”

“ఆ… కొంచం బద్దకమే మీ నాన్నకి… సినిమా కి రమ్మంటే మాత్రం చక్కగ ముస్తాబై వచ్చేవారు.. కవిత్వం బాగా రాసే వారు…”

“చెప్తుంటారు… మీరు కవిత్వం రాయరు కాని బాగా ఇష్టపడే వారని..”

“అవునా… నా గురించి ఇంకా ఏమి చెప్పేవారు… మీ మమ్మీ ఏమీ అడిగేది కాదా..?”

“ఏ సందర్భం వచ్చినా మీ గురించి పెద్ద కాసేట్ వేసేవారు నాన్న. అమ్మ విసుక్కోవటంతో …ఎక్కువగా నాకే చెపుతుంటారు. మీకు నీలం రంగు ఇష్టమనీ, ఐస్ క్రీం తెగ తింటారని, తను వారించే వారని, సినిమాలు క్లాసులు ఎగ్గొట్టి మరీ చూసేవారనీ… ”

“చాల చెప్పారే…. అప్పట్లో మాదో పెద్ద గ్యాంగ్ ఉండేది. క్లాస్సేస్ ఎగ్గొట్టి సినిమాలు వెళ్ళే వాళ్ళం. వేణుకి నచ్చేది కాదు క్లాసులు ఎగ్గోట్టడమంటే… కొంత కాలానికి తను కూడా మాలా మారి పోయారు క్లాసులు ఎగ్గొట్టడంలో..” అంది నవ్వుతూ

ఇంతలో తడిసిన బ్యాగ్ ని, కలశాన్ని పక్కనున్న టీ  పాయ్   మీద పెట్టింది పద్మజ. తెల్లటి టీ  పాయ్   కవర్ మీద పెట్టేసరికి, అంతా తడి, మరకలు అయ్యాయి ఆ కవర్ కి. అసలే శుభ్రత అంటే పంచ ప్రాణాలు పద్మకి. ఆ అమ్మాయి అలా పెట్టి, కవరింగ్ క్లోత్ పాడు చేసేసరికి  ఉసూరుమంది ప్రాణం.. ఎంత దాచుకున్నా పద్మ ముఖం పై లీలగా కదలాడిన ఆ విసుగు ని చప్పున చూసేసిందా అమ్మాయి.
“సారీ ఆంటీ.. టీ  పాయ్   పాడై పోయింది.. ఎంత వద్దన్నా నాన్న ఈ పాత బాగ్ ని, ఈ రాగి కలశాన్ని నాకు అంట కడతారు.. నాకే ఇబ్బంది అనిపిస్తుంది.. మీకు శ్రమ కలిగించాను..” అని బాగ్ ని, కలశాన్ని తన వొళ్ళో పెట్టుకుంది.

” పర్లేదులే..” అని మనసులో నొచ్చుకున్నా…. అప్రయత్నంగా అనేసింది పద్మ.

“ఏం పని మీద వచ్చావమ్మ … ఏమైనా సాయం కావాలా…?” అడిగింది పద్మ.

“ఈ వూరు వస్తున్నా కదా .. మీరు ఉంటారు.. జస్ట్ పలకరించి వెళ్ళమన్నారు నాన్న.. కాలేజీ చదువు అయ్యాక ఆఖరున మీతో సరిగ్గా వీడ్కోలు తీసుకోలేదు అని అప్పుడప్పుడూ అనేవారు…”

“అది గతం కదా.. ఇప్పుడు అలోచించి లాభం లేదు కదా.. మనిషి కలలలో జీవించ కూడదు.. వాస్తవం లో ఉండాలి ఎప్పుడూ.. అనే వారు మీ నాన్న..”

“మరి అలాంటి మనిషి కలల లోకంలోకి  ఎలా వెళ్ళిపోయారు ఆంటీ..?”

“సావాసం చేస్తే వారు వీరు అవుతారు అని సామెత ఉంది తెలుసు కదా.. ”

“అది మీకు కూడా వర్తిస్తుంది కదా ఆంటీ…?”

“నిజమే.. అందు వల్లే కదా  …చదువు పూర్తయేసరికి నేను వాస్తవం లోకి వచ్చేసాను..”

“కాని… తను మాత్రం కలలో ఉండిపోయారు..”

“ఎంత కాలంలే..తను కూడా పెళ్లి చేసుకున్నారు కదా…నీలాంటి బంగారు తల్లి దొరికింది కదా..” అంది పద్మ నవ్వుతూ.

“అది మాత్రం నిజం ఆంటీ… నా లాంటి అమ్మాయి తనకి కూతురవటం తనకి అదృష్టమని తనే అంటారు.. ఇక నేను బయల్దేరుతాను ఆంటీ ”

“కాస్తా ఫ్రెష్ అయ్యి వెళ్ళమ్మా..:” అంది పద్మ.

అలాగేనని తల ఊపి ఈ సారి బాగ్ ని, కలశాన్ని బాగా తుడిచి టీ  పాయ్  మీద పెట్టి బాత్ రూం వెళ్ళింది పద్మజ.

తన జాగ్రత్తకి నవ్వు వచ్చింది పద్మ కి.

తను వచ్చే లోపు వేడి కాఫీ , పకోడీ రెడీ గ ఉంచింది పద్మ.

కాఫీ, పకోడీ తిని, “చాల థాంక్స్ ఆంటీ … ఇక బయల్దేరుతాను.. ” అని బాగ్ తీసుకుని ముందుకి కదిలింది పద్మజ.

గుమ్మం దాక సాగనంపడానికి వెళ్ళింది పద్మ. చివరి నిమిషం లో గుర్తించింది తన రాగి కలశం టీ  పాయ్  మీదే ఉండిపోయిందని..

“పాపా… నీ రాగి కలశం మరిచి పోయావు” అంది పద్మ…

” ఓ… సారి…. ఆంటీ…..ఈ డాడి ఎప్పుడూ ఇంతే…వద్దంటే ఇలాంటి పనులు అంట

కడతాడు.. చెప్పులేసుకున్నాను… మీరు తెచ్చి ఇవ్వండి.. ఆంటీ. ప్లీజ్” అంది పద్మజ.

గబా… గబా లోనికి వెళ్లి రాగి కలశం చేతిలోకి తీసుకుని రాబోతూ… దానికి చుట్టి ఉన్న గుడ్డని ఎందుకో పరిశీలనగా చూసింది పద్మ.. బాగా తెలిసి వున్నట్లుగా అనిపించింది… అప్పట్లో ఓ సారి వేణుకి బస్సేక్కబోతూ దెబ్బ తగిలితే, తను చున్ని తీసి ఇచ్చింది బ్లీడింగ్ ఆపటానికి. అప్పట్లో తన ఫ్రెండ్స్ అంతా.. సినిమాలలో హీరోయిన్ లాగ కట్టు కట్టలేకపోయవా అని ఏడిపించేవాళ్ళు. ఈ గుడ్డ అదేనేమో అనిపించింది పద్మకి  ఆ కలశం తన స్పర్శ కోసమే వేచి ఉన్నట్లుగా ఓ మూగ భావన.. కొంత సేపు చుట్టూ శూన్యం ఆవరించింది పద్మ కి…

“ఆంటీ… త్వరగా తీసుకు రండి.. ” అని పద్మజ కూడా పిలువ లేదు…  ఆ సందర్భం కోసమే ఎదురు చూస్తున్నట్లుగా గుమ్మం దగ్గరే ఉండి పోయింది.

కాలం ఘనీభవించింది కాస్సేపు.. అలా ఎంత సేపయిందో తెలియదు… ఇంతలో ఎక్కడో ఉరిమిన శబ్దం… … ఆ శబ్దానికి ఈ లోకం లోకి వచ్చింది పద్మ..

పక్కనే ఉన్న సాయి బాబా దగ్గర ఓ సారి కలశాన్ని తాకించి… గుమ్మం దగ్గరికి వచ్చింది పద్మ..

పద్మజ వెనుతిరిగి ఉంది… ముఖం కనపడటం లేదు…

“తెచ్చారా ఆంటీ…ఇలా ఇవ్వండి…” అంటూ వెనకకి తిరక్కుండానే… చేయి చాపింది…

” ఈ డాడి తో ఒక తల నొప్పి కాదు… కృష్ణ నది కి వెళ్లి రమ్మంటాడు… ఆ తరవాతే కాలేజీ కెళ్ళాలి అట  … ఏమిటో ఈ చాదస్తం..” అంది తల తిప్పకుండానే..

“కలశం తీసుకోమ్మా…” అంటూ చేతుల్లో పెట్టింది పద్మ.. ఇంకా ఏదో అడగాలని.. కాని… స్మృతి ఫలకాలు… స్వర  సొరంగానికి  అడ్డుపడుతున్నాయి   …

“వెళ్తున్నా ఆంటీ.. కలశం తీసుకొచ్చి  ఇచ్చినందుకు థాంక్స్” చివరి మాటల్ని మాట్లాడేటపుడు… గొంతు జీర పోవటం పద్మ కి తెలుస్తూ ఉంది…

కలశాన్ని వేలి కొనతో తాకుతూ, వదిలివేస్తూ… ” అలాగేనమ్మా…. జాగర్త తల్లీ…” అంటూ ఉంటె, తన గొంతులోనూ అదే జీర…

తండ్రి చివరి కోరిక ని తీర్చిన తృప్తి తో ఉన్న ఓ అమ్మాయిని, జ్ఞాపకాల శిలలు కరుగుతూ కళ్ళు మసక బారుతున్న ఓ ఆవిడని చూస్తూ … అక్కడ కనపడని మేఘాలేవో కమ్ముకుంటున్నాయి…….

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

3 Responses to మేఘమా మెరవకే ఈ క్షణం (కథ పునః ప్రచురణ)

  1. హృదయం భారం..
    కొన్ని..బంధాలు..బరువైనవి. కడ వరకు.. మోస్తూ..ఉండాలి.

  2. Ramakrishna,the story u have written second time is very interesting,reflecting the love failure of college days.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s