కొన్ని ప్రయాణాలు మరిచిపోలేనివి

కొన్ని ప్రయాణాలు మరిచిపోలేనివి. ఇదీ అలాంటిదే. సుమారుగా ఇరవై ఏళ్ళ క్రితం… ఓ సారి కెమెరాని ఫ్యాన్ పైకి జూమ్ చేసుకొని నా ఫ్లాష్ బాక్ లోకి రండి.. లక్నో లో ఉన్న రోజులవి.. ఒక సారి డిల్లీ కి వెళ్ళాల్సి వచ్చింది. ముందుగానే టికెట్స్ రిజర్వ్  చేసుకున్నాను.. వెళ్ళటానికి.. తిరిగి రావటానికి.

ప్రయాణానికి ఓ వాక్ మాన్ , కొన్ని బ్యాటరీలు.. రెండు రోజులకు సరిపడా బట్టలు సర్దుకుని స్టేషన్కి బయల్దేరాను. రైలు వెళ్తుంటే…పాటలు వింటూ, కిటికీ నుండి చూస్తూ ఉండటమంటే ఎంతో ఇష్టం.. కాని కొంత సేపట్లో జరగబోయేది నాకు తెలిసుంటే.. అది విధి విలాసమెందుకౌతుంది ? … ఉత్సాహంగా స్టేషన్ చేరాను..  రాత్రి ఎనిమిది గంటలకు రైలు రావాలి వేరే వూరు నుండి. అదేమిటో ఆ రోజు స్టేషన్ అంతా రద్దీ విపరీతంగా ఉంది.

కొంత సేపటికి నాకు విధి అంటే నమ్మకం కలిగించబోతున్న ఆ రైలు రానే వచ్చింది. వెతుక్కుంటూ నా బోగీ వైపు కదిలాను ఆ జనసముద్రంలో  తోసుకుంటూ. నా బోగీ దగ్గర కెళ్ళేసరికి … అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యాను. బోగీలోకి కనీసం చీమ కూడా వెళ్ళటానికి లేనంత జనం.. తోపులాట.. రైలు కదిలిపోతోంది.. అంతవరకూ దొరబాబులా  చూసుకుంటూ ప్లాట్ఫారం పైనే వున్న నేను, పరిస్థితి విషమిస్తుందని అనిపించేసరికి.. “జై బజరంగ్ బలీ” అనుకుని.. అభిమన్యుడిని మనసార తలుచుకుని, జనం లో దూరేశాను.. అలా దూరే సరికి… నా ప్రమేయం లేకుండా ఆటోమేటిగ్గా బోగీలోకి నేట్టివేయబడ్డాను… ఓ బెల్ట్ కన్వేయర్ పై వెళ్తున్నట్టుగా.. హమ్మయ్య ‘ఒక అంకం పూర్తయ్యింది” అనుకుని నా బెర్తు నంబరు చూసుకుంటూ, సదరు బెర్తు చేరేసరికి, అప్పటికే ఆ బెర్తు పైన అప్పటికే ఐదుగురు అసీనులయ్యున్నారు. మాంచి రంజుగా ఉన్నట్టుంది.. పేకాటలో లీనమయ్యి ఉన్నారు.. అప్పటికే పద్మ వ్యూహం లోంచి వచ్చిన నేను వీళ్ళను నా బెర్తు పై చూసే సరికి చిరాకేసింది.. అయినా కంట్రోల్ చేసుకుంటూ..” భాయ్ సాబ్.. ఇది నా బెర్తు..” అని చెప్పాను.. వారిలో ఓ ఆసామి చేతిలో ఉన్న పేక ముక్కలను కొద్దిగా దించి నా వైపు ఓ నిర్వికార దృక్కు వేసి.. , కాస్త జరిగి మళ్ళీ ఆటలో లీనమయ్యాడు. “క్షణ క్షణం” సినిమాలో అష్ట కష్టాలు పడుతున్న శ్రీదేవి తన ఫ్రెండ్ కోసం హోటల్ లో వెయిట్ చేసి వెళ్తుంటే.. అక్కడ ఓ ఆకతాయిమూక తను వెళ్ళకుండా కాళ్ళు అడ్డం పెడతారు. ఆ క్షణం లో శ్రీదేవి ముఖం లో కనిపించే నిస్సహాయమైన చూపు ఇప్పటికీ గుర్తే. సరిగ్గా  అలాంటి expression పెట్టి, ఆ శ్రీదేవి “మిమ్మల్నే.. కాళ్ళు తీయండి” అని గద్దించినట్టుగా  నేను కూడా, ” మిమ్మల్నే.. ఈ బెర్తు ఖాళీ చేయండి” అన్నాను బేలగా. రసకందాయం లో ఉన్న ఆటని డిస్టర్బ్ చేస్తున్న ఈ నరాధముడెవడా  అని నా వైపు చూసి “ఈ కాస్త జరిగాం కదా.. అక్కడ కూర్చో.. అరుస్తున్నావేంటి..” అని గదమాయించాడో ఓ ఆసామి. పరిస్థితి విషమిస్తోందని గ్రహించి, కిమ్మనకుండా ఆ జాన బెత్తెడు స్థలం లో ఒద్దికగా కూర్చున్నాను “టీ. టీ.ఈ  రాక పోతాడా.. వీరి భరతం పట్టకపోతాడా..” అనే గంపెడాశతో.. కాని నాకేం తెలుసు ఆ రోజు ఆ బోగీలోని వారంతా మరుసటి  రోజు డిల్లీలో జరిగే ఏదో ర్యాలీ కేళ్తున్నారనీ .. ఆ రోజు ఎవరూ టికెట్ చెకింగ్ కి రావటం లేదనీ.. ఫలితంగా ఆ రాత్రంతా జాగరణ చేస్తూ, వారి ఆటలో అరటిపండులాగా గడిపి డిల్లీ చేరాను.
రెండు రోజులలో పని చూసుకుని, తిరుగు ప్రయాణమయ్యాను. స్టేషన్ చేరి నా బోగీలో నా బెర్తు దగ్గరికి వెళ్లాను. అందులో ముగ్గురు అంతకుమునుపే సెటిల్ అయ్యి వున్నారు. మనసు ఏదో కీడు శంకించింది..” ఇది నా బెర్తు.. మీరెవరు..” అని అడిగాను.” మేమంతా డిల్లీలో ర్యాలీ కోచ్చాము. మా వూరికి తిర్గి వెళ్తున్నాము.  కావాలంటే… మీరు కూడా మా పక్కన కూర్చోవచ్చు” అని అందులోని ఓ ఆసామి కరుణిస్తుంటే  ఎందుకో ఆతని ఉదాత్తత కి మనసు పులకించి, అతని పక్కనే ఎప్పటిలాగా ఒద్దికగా కూర్చుని తిరుగు ప్రయాణం కావించాను. ఇంతకు మునుపులాగా “ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని..” అనే ఆశలేమీ పెట్టుకోకుండా..అలాగ ర్యాలీ తో వెళ్లి ర్యాలీ తో తిరిగి వచ్చాను.

కెమెరాని మళ్ళీ ఫ్యాన్ పైకి తీసుకెళ్ళి, మీరు నాతో పాటు ఫ్లాష్ బాక్ నుండి బయటికి రావచ్చిక..

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

3 Responses to కొన్ని ప్రయాణాలు మరిచిపోలేనివి

  1. హహహ బాగుంది డబల్ ధమాకా మీకు!

  2. పానీపూరి123 says:

    > ఓ సారి కెమెరాని ఫ్యాన్ పైకి జూమ్ చేసుకొని నా ఫ్లాష్ బాక్ లోకి రండి..
    > కెమెరాని మళ్ళీ ఫ్యాన్ పైకి తీసుకెళ్ళి, మీరు నాతో పాటు ఫ్లాష్ బాక్ నుండి బయటికి రావచ్చిక..
    🙂
    నిజంగా అలా ర్యాలి వాళ్ళు వెళ్ళే రూట్లో ప్రయాణాలు పెట్టుకుంటే, టికెట్టు కొనే బాద తప్పుతుంది! 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s