“మిథునం”

మిథునం — ఈ చిత్రం చూస్తుంటే రెండు అసంకల్పిత చర్యలు జరగటం తధ్యం. తెలుగుతనం తొణికిసలాడే ఓ ఇంట్లోని పెద్దావిడ చేసే వంటలు చూస్తూ, ఆ వంటలకు ఆ ఇంటాయన చేసే పోపులాంటి వ్యాఖ్యానాలు వింటుంటే నోరూరటం  ఎంత అసంకల్పితమో, చిత్రం ముగింపు చూసాక, మనసులో ఎక్కడో ఓ మెలితిరిగిన భావన కలిగి, గుండెలోని తడి కంటి కెగసి, దృష్టి మసకబారటమూ అంతే అసంకల్పితం. 


దూరమైన పిల్లల్ని తలచుకుంటూ, నేటి నాగరికతలు ఏవీ తాకని ఓ పర్ణశాల లాంటి ఇంట్లో తమ వానప్రస్తాశ్రమాన్ని ఒకరి సాంగత్యంలో ఒకరు సాంత్వన పొందుతూ గడిపే ఓ జంట జీవితాన్ని తైల వర్ణ చిత్రంలా చూపించిన చిత్రమిది. రమణ గారి కథని, తనదైన శైలిలో చూపించిన భరణి గారు అభినందనీయులు.
 
ఈ చిత్రం గురించి ఎప్పుడో ఓ సారి చదివాను పత్రికలలో. అప్పుడే నిర్ణయించేసుకున్నాను తప్పకుండా చూడాలని. కారణాలు మూడు .. బాలు..బాలు.. బాలు అంతే.. తను పాడితే పులకింతే..మాట్లాడితే మైమరపే.. అభినయిస్తే అద్భుతమే..తెలుగుతనానికి కొత్త తియ్యందనాన్ని రంగరించిన మహనీయుడు బాలు గారు. కథ ముందుగానే తేలిసి  ఉండటంతో, బాలుగారు ఈ పాత్రలో ఎలా ఒదిగిపోయారో అన్న కుతూహలమే చిత్రం చూడటానికి కారణం. నా ఎదురు చూపు వ్యర్థం కాలేదు. చిత్రం చూస్తున్నంత సేపూ, బాలు గారి నటన కనిపించలేదు… నిజ జీవితంలో తను ఎంత సహజంగా , స్వచ్చంగా ఉంటారో, అదే ఆ పాత్రలో కనపడింది. 
 
 కథా వస్తువు గురించి చెప్పాలంటే ఇది ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రోజు ఎదురయ్యే సందర్భమే.. జీవన గమనంలో ఎన్ని పరుగులు పెట్టినా, ఏదో ఒక రోజు పరుగు ఆగక తప్పదు..  ఆపరుగు ఇంకొకరి జీవితంతో ఆత్మీయంగా పెనవేసుకున్నప్పుడు, ఆ పరుగు ఎలా ఆగుతుంది అన్న మీమాంసకి ఓ కొత్త అర్థం చూపిస్తుందీ చిత్రం. 
 
చిత్రం అంతా రెండే ముఖాలు.. ఒకటే ఇల్లు… అప్పుడప్పుడూ ఇంటి బయట చూపించే సన్నివేశాలలో కూడా ఎక్కడా జన సంచారం ఉండదు..ఆకాశవాణి లో వచ్చే వివిధ కార్యక్రమాల నేపధ్య గానం, కార్యక్రమాల ప్రకటనలు ప్రేక్షకుల్ని మునుపటి రోజుల్లోకి తీసుకేల్తుంటాయి. ఈ కార్యక్రమాలలో నాకు గుర్తొచ్చిన ఒక రేడియో కార్యక్రమం, అప్పట్లో వచ్చే చిత్తరంజన్ గారి ” ఈ పాట నేర్చుకుందాం”. 
 
భరణి గారు మాటలు కూడా సరళంగా, అర్థవంతంగా  రాసారు. “మనిషిగా పుట్టడం సులువే గాని, మనిషిగా బ్రతకటమే కష్టం” అన్న సంభాషణ ఓ మచ్చు తునక.
 
రణ గొణ  ధ్వనులు ఇష్టపడని వారికి, తెలుగుదనాన్ని ప్రేమించే వారికి, సున్నితమైన బాంధవ్యాలను చూడాలనుకునేవారికి, ఓ శీతా కాలం కాలం ఆస్వాదిస్తూ చూడాల్సిన చక్కటి చిత్రమిది.
Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s