ప్రేమల టాకీస్ లో సంపూర్ణ రామాయణం, గురునాథ థియేటర్ లో స్నేహం, ఎం ఎస్ ఆర్ లో గోరంత దీపం, ప్రతాప్ లో చూసిన వంశ వృక్షం , వెంకటేశ్వరా లో ముత్యాల ముగ్గు చూసిన జ్ఞాపకాలు సునామీలా కమ్మేశాయి అతడు లేడని తెలిసాక. సినిమాలని కేవలం వినోదం కోసమే 75 పైసల టికెట్ కొనుక్కుని చూసే ఆ రోజుల్లో, ఎందుకో ఈ చిత్రాలు …. ముఖ్యంగా స్నేహం, గోరంత దీపం అప్పట్లోనే ‘సినిమాలంటే ఇలా కూడా ఉంటాయి, ఇలా ఉన్నా బాగుంటాయి’ అనిపించేలా చేశాయి. ముఖ్యంగా ఈ రెండింటినీ ఎందుకు చెపుతున్నానంటే, వీటిని అప్పట్లో చూడటమే తప్ప తర్వాత ఎన్నడూ చూడ లేదు. కాని ఆ సినిమాలు అలానే గుర్తుండిపోయాయి. స్నేహానికున్న మహత్తు ఈ చిత్రం తోనే అర్థమయ్యింది. వాణిజ్య పరమైన సినిమాలలో కనపడే వాణిశ్రీ ఎంతో subtle గా గోరంత దీపం సినిమా లో చేసిన నటన గుర్తుండిపోయింది. వంశ వృక్షం చిత్రం ఆ మధ్య మళ్ళీ చూస్తే, మనసుల సంఘర్షణ ని ఎంత హృద్యంగా చూపించాడో అనుకున్నా.
కొన్ని సినిమాలలో రూపంలో ను, దృశ్యాల ఫ్రేముల లోనూ ఏదో తెలియని ప్రత్యేకత కనపడేది. కాల క్రమేణా అర్థమయ్యింది వాటి వెనక ఉన్న ఆ అద్భుత రూప శిల్పి ఉన్నాడని.
నేను పదవ తరగతి చదివే రోజుల్లో, మా మేష్టారు రామ మూర్తి గారి ఇంట్లో, నేను వారి కార్టూనుల సంకలనం చూడటం జరిగింది . అందులో “…… కొన్ని తరముల సేపు/గుండె నుయ్యలనూపు/ఓ కూనలమ్మ ” అన్న ఆరుద్ర పరిచయం ఇప్పటికీ గుర్తే. గయ్యాళి భార్య, బక్క పలచటి భర్త ల పై కార్టూన్లను చూసి ఎన్ని సార్లు నవ్వుకున్నానో.. స్వాతి వార పత్రిక లో కేవలం వివిధ శబ్దాల పై అతను వేసిన కార్టూన్లను చూసి నవ్వుకుంటూనే అతడి సృజనాత్మకత కు ఎంత అబ్బుర పడ్డానో (రేడియో లో ఎవరో పాడుతుంటే “గజ గజ…” అని చూపిస్తూ, ఆ స్వరం వింటున్న భర్త “ఏమోయ్ అ స్వరం తల త్ మహమూద్ ది కదా” అనడం అలా గుర్తుండి పోయింది. అది ఎంత apt గా ఉందొ కదా అని అనిపించింది)
అతడి లిపి చూసి మొదట ఇదేమిటి చిన్న పిల్లాడిలా రాసాడు అని అనుకుంటూనే, ఆ లిపిని అనుకరించటం మొదలెట్టే వాడిని. ఆ లిపి లేనిదే ఎన్నో పుస్తకాలకు నిండు తనం లేదన్నది జగమెరిగిన సత్యం.
అతడు స్నేహానికి ఇచ్చిన విలువ చూసి ‘ఇలా కూడా ఉంటారా, అందునా ఆ రంగం లో….’ అని ఎన్నో సార్లు అనుకున్నా. రెండేళ్ళ కిందట అతడి మిత్రుడి మరణ వార్త తెలిసినప్పుడు “అయ్యో తనెలా ఉండగలడు ..ఆ చిత్రాన్నేలా తీయ గలడు .” అని ఆక్రోశించింది మనసు. కాని అంతటి విషాదం లోనూ శ్రీ రామ రాజ్యం లాంటి కళా ఖండాన్ని అందించిన ఆతడి మానసిక ధృడత్వాన్ని ఏ కొల బద్ద తో కొలవగలం?
అతడి ఎన్నో ఫోటోలు చూస్తున్నా .. అందులోని నవ్వు ని చూస్తున్నా … చిన్న పిల్లాడి నవ్వులోని నిర్మలత్వం … కేవలం నిర్మలత్వం కనపడుతోంది ఆ నవ్వులొ.. ఆ నవ్వులో “ఎంత ఎదిగినా అంత వొదిగి ఉండాలన్న” భావన వుంది. “ఎంత కీర్తిని సాధించినా , కాళ్లె పుడూ నేల మీద ఉండాలన్న”సందేశం వుంది. “ఎన్ని వున్నా , స్నేహాన్ని మించిన సంపద లేదన్న” అర్థం ఉంది.
నా బాల్య జ్ఞాపకాలకి రంగుల నగిషీలు చెక్కిన ఆ బహుముఖ ప్రజ్ఞా శాలికి వీడలేని వీడ్కోలు పలుకుతూ ……