సుబ్బయ్య హోటల్ @ కాకినాడ… “రుచులు” చూడ తరమా?

ఈ పేరు వినగానే… ఈ హోటల్ వెళ్ళినవారెవరైనా  ఉంటె, ఒక్క సారి గా వారి జిహ్వ నాడులలో చలనం రావటం ఖాయం. ఓ సారి ఉద్యోగ రీత్యా కాకినాడ వెళ్ళాల్సి వచ్చింది. ఆ వూరు వెళ్తున్నాను అనగానే, ఇంతకు మునుపు ఆ వూరు వెళ్లోచ్చిన, నా సహోద్యోగి అయిన ఓ బెంగాలి దాదా (రౌడి కాదండోయ్ … అన్నయ్య లాంటి వాడు) ఈ హోటల్ లో మాత్రం ఓ సారైనా తినమని మరీ మరీ చెప్పారు.

కాకినాడ వెళ్ళాక, నేను, నాతో పాటు ఇంకో ఇద్దరు “దాదా” లు ఈ హోటల్ కి వెళ్ళాం. ఆ వూరు వీధులు తెలియవు కాని, మొత్తానికి పీ. ఆర్. కాలేజీ పరిసరాల దగ్గర.. కొంచం interior గా ఉందీ హోటల్. బయట నుండి చూస్తే .. అతి సాధారణం గా ఉంది.. లోనకెళ్తే రద్దీ బాగానే ఉంది.  మా వంతు వచ్చే సరికి ఓ అర గంట పట్టింది. లోన గోడలు.. సెర్వెర్స్ వేష ధారణ అతి సాధారణంగా  ఉంది.. మా దాదా మరీ hype చేసాడేమో అనిపించింది. వడ్డన మొదలయ్యింది.. అక్షయ పాత్రలాగా విస్తరాకులో సైడ్ డిషెస్, స్వీట్స్, పడుతూనే ఉన్నాయి.. ఏ ఐటెం రుచి చూసినా… దానికదే సాటి అనిపించేలా ఉన్నాయి.. బాగుందని ఓ ఐటెం ముందు ఖాళి చేస్తే… వెంటనే replenish చేయటానికి అక్కడి సిబ్బంది సిద్ధం. ఆ అరగంట మా ఆకుల్లో అన్ని రకాల ఫుడ్ ఐటెం లు వర్షిస్తూనే ఉన్నాయి.. సుమారుగా నలభై రకాల అధరువులు, కూరలు, పిండి వంటలు, స్వీట్స్ వడ్డించి వుంటారు.  పెళ్లి చూపులకు వెళ్లి వాళ్ళు పెట్టే ఫుడ్ ఆబగా తింటూ, ఆఖరికి  పెళ్లి కూతురుని కూడా చూడటం మరిచి పోయే ఓ పెళ్లి కొడుకు సినిమా సన్నివేశం గుర్తొచ్చింది మధ్యలో.

వడ్డించే  ప్రతి వారు,  వడ్డిస్తూ..” ఈ ఐటెం ట్రై చేయండి సార్… ఇది  చాలా బాగుంటుంది..” అంటూ ఒక్కో ఐటెంని కొసరి కొసరి మరీ వడ్డిస్తున్నారు.. వారి నమ్రత .. వడ్డించే విధానం చూసి ఆశ్చర్యపోయాను.ఇంతలా ప్రేమ కురిపించారంటే.. బిల్లు, దాంతో పాటు టిప్పు కూడా భారీగా ముట్టచెప్పాలేమో అని మనసులో అనుమానం.. కానీ భోయనాలయ్యాక, నా అనుమానం పటా “ధోవతులు” చేస్తూ,   కేవలం నలభై రూపాయలు (అప్పట్లో) ఒక్కక్కరికి   బిల్లు వచ్చింది.. మళ్ళీ హాచ్చర్యం .. వచ్చేసే ముందు.. పది రూపాయలు సర్వర్ చేతిలో పెట్టబోయాను.. “పర్లేదు సార్.. మీరు భోన్చేసారు. సంతోషం” అన్నాడు. అయిష్టం గానే టిప్పు తీసుకున్నాడు.

ఇలాంటి హోటల్ ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించ లేదు. బహుశా.. ఇలాంటి హోటల్ ఇంకెక్కడా ఉండబోదని నా ప్రగాఢ నమ్మకం.

వూరు వచ్చేసాక.. నాకు సలహా చెప్పిన దాదా కి కృతజ్ఞతలు చెప్పాను.. దాదా అర్ధ నిమీలిత నేత్రాలతో నుదిటి పై వేలితో రాసుకుంటూ చెప్పాడు.. ” నువ్వు పొరపాటు చేసావు.. నువ్వక్కడ న్యాయం చేయాలంటే.. కనీసం ఆ రోజు పొద్దుట ఉపవాసం ఉండి భోజనానికి వెళ్ళాల్సింది”

ఈ టపా రాసిన వెంటనే  ఈ హోటల్ కి ఓ వెబ్ సైటు ఉందని బ్లాగ్మిత్రులు శంకర్ గారు అమూల్యమైన లింక్ ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు. హోటల్ గురించి తెల్సుకోవాలంటే, ఇక్కడ క్లిక్ చేయండి

This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

27 Responses to సుబ్బయ్య హోటల్ @ కాకినాడ… “రుచులు” చూడ తరమా?

  1. SHANKAR says:

    కెవ్వు కేక. కేకో కేక.
    మా ఊరి సుబ్బయ్య హోటల్ గురించి రాసినందుకు ధన్యవాదాలు మాస్టారూ. మీరు చెప్పింది నిజమే ఒక్కసారి అక్కడ తిన్నవాళ్ళు ఎవరూ జీవితాంతం ఆ రుచులు, ఆతిధ్యం మరచిపోలేరు. ఆ హోటల్ రామారావు పేట మూడు లైట్ల జంక్షన్ నుంచి గాంధీ నగర్ గాంధీ బొమ్మ సెంటర్ కి వెళ్ళే దారిలో ఉంటుంది. (అఫ్కోర్స్ ఆ హోటలే ఒక ల్యాండ్ మార్క్ లెండి). నిజానికి ఆ హోటల్ అసలు పేరు శ్రీ కృష్ణ విలాస్. కానీ ప్రారంభించిన సుబ్బయ్య గారి పేరుమీదే ఆ హోటల్ పాపులరయింది. కొత్తల్లుడికి మర్యాదలు చేసినట్టు కొసరి కొసరి వడ్డించడం, అక్కడి అచ్చ తెలుగు రుచులు కేకో కేక. కాకినాడ వచ్చి కోటయ్య కాజా, సుబ్బయ్య హోటల్ భోజనం చేయలేదంటే ఆ ట్రిప్ కంప్లీట్ కానట్టే. వీలయితే మీ పోస్ట్ లో ఆ హోటల్ లింక్ జత చేయండి

    http://subbayyahotel.com/

  2. నిజమే నండీ, ఒకే ఒక్కసారి అక్కడ మేము భోజనం చేసాం. ఆరుచి చెప్ప నలవి కాదు. అంతే కాదు, అక్కడి వారు కొసరి కొసరి, రుచులు వర్ణిస్తూ ఇంట్లో వ్యక్తిలా వడ్డించే తీరు ఎంత మేచ్చట వేసిందో. ఇప్పటికీ మరిచి పోలేం. ఫొటో పెడితే బావుండేదేమా కదా

  3. SIVARAMAPRASAD KAPPAGANTU says:

    ఇప్పుడు ఆ హోటల్ ఉన్నదో లేదో. ఈ సారి విజయవాడ వెళ్లినప్పుడు ఈ హోటల్ కోసమే కాకినాడ వెళ్ళాలి.

  4. SHANKAR says:

    @ శివరామ ప్రసాద్ గారు
    ఇప్పటికీ ఉందండీ. ఇన్నేళ్ళయినా అదే రుచి, అదే ఆత్మీయత. వాళ్ళ అబ్బాయి తరం నడుపుతోంది ప్రస్తుతం.
    @ జోగారావు గారు
    లింక్ క్లిక్ చేయండి. మా ఐటమ్స్ లో ఉన్న జాబితా చూడండి. వెంటనే ఆకలేయకపోతే అడగండి :)…సైట్ లోనే ఫోటోలు కూడా ఉన్నాయండీ

    • mhsgreamspet says:

      శంకర్ గారు
      చాల మంచి ఇన్ఫో ఇచ్చారండి. థాంక్స్.
      జోగారావు గారు
      మీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు థాంక్స్ అండీ
      శివరామ ప్రసాద్ గారు..
      శంకర్ ఆ హోటల్ ఇంకా ఉందని భరోసా ఇచ్చారు. త్వరగా వెళ్లి.. మీరు ఆ రుచుల్ని ఆస్వాదించండి. మా అందరితో పంచుకోండి.

  5. మీరు భలే వోరే !!
    మీ వల్ల ఈ బిజీ మార్చ్ లో
    వచ్చే ఆదివారం ఎంత పనున్నా సరే 225 కిలోమీటర్లు
    కాకినాడ రోడ్ ఎక్కటం
    సుబ్బయ్య గారి హోటల్లో మనసారా మెక్కటం గా
    నిర్ణ యించటమైనది
    ధన్య వాదములు !!!

  6. chinni says:

    మీరు సుబ్బయ్య హోటల్ గురించి రాసింది చదువుతుంటే నా ఫీలింగ్సే అక్కడ రాస్తున్నార అన్నంత అనుమానం వచ్చింది .నేను రెండేళ్ళక్రితం ఆఫీసు పని మీద వెళ్ళినప్పుడు అక్కడి స్టాఫ్ చెప్పారు దాని ప్రశస్తి ట్రై చేయమని తప్పక నచ్చుతుందని చెప్పారు ,అప్పుడు నాతో పాటు నా కొలీగ్స్ హైదరాబాదు నుండి వచ్చినవాళ్ళు కూడావున్నారు …ఇలానే ఇబ్బంది పడుతూ తినగలమా లేదా అనుకుంటూనే వెళ్ళాము .ప్రతి ఐటెం వర్ణిస్తూ ఇది బూరె ఇది చక్రపొంగలి అంటూ తినలేనన్ని అయిటేమ్స్పెట్టారు .చాలారోజులు గుర్తు చేసుకున్నాము .అన్నట్లు కాకినాడ లో సువాసన కలిగిన తియ్యటి వక్కపలుకులు దొరుకుతాయి ,ఇటీవల నా మిత్రుడు వీటి రుచి మాకు పరిచయం చేసారుమొత్తం మావారే ఖాళి చేసి కాకినాడకి ఇండెంట్ పెట్టమంటున్నారు:-) ,మీరు ట్రై చేయండి ఈసారి కుదిరితే .

  7. Sheshu says:

    నేను కూడా చాలా రోజుల నుంచి ఒక పోస్ట్ పెడదామనుకున్న, ఎప్పుడో పదేఅల్ల క్రితం తిన్నాను. పీకల దాక తిని, ఒక గంట నడిచిన తరవాత కొంచ్చెం విశ్రమించాము. చాల అద్భుతం గ ఉంటుంది.

  8. మంచు says:

    ఈ టపా చదివాక ఒక సారి ఫ్లాష్ బ్యాక్ లొకి వెళ్ళిపొయాను.
    అబ్బబ్బ… సుబ్బయ్య హొటెల్ … రుచి, ఆత్మీయత. థె బెస్త్.

    నేను మొదటిసారి ఆ హొటల్ కి వెళ్ళినపుడు ఆ క్యూ చూసి విసుగొచ్చింది. ఆ చిరాకు తినేవరకే అని వేరే చెప్పక్కర్లేదు. ఆ తరువాత నుండి వీలయితే అక్కడ పడి తిని తిని, ఆపసొపాలు పడుతూ ఇంటికి రావడం , లేకపొతే బుట్టబొజనం పార్సిల్ తెచ్చి ఫుల్ గా తినేసి నిద్రపొవడం…
    కందిపొడి నుండి పెరుగు వరకూ… ఇన్నిసార్లు తిన్నా ఏ ఒక్కసారి ఈ ఐటెం ఆర్డినరి గా ఉంది అన్నా ఫీలింగ్ రాలేదు. అన్నీ సూపర్. దానికొ తోడు కొత్తల్లుడికి వడ్డించినట్టు కొసరి కొసరి వడ్డించడం ఇంకొ స్పెషల్…. అతని కొడుకు కూడా సుబ్బయ్యగారి లాగానే ఆ హొటల్ నిర్వహించడం చాలా ఆనందించదగ్గ విషయం. ఈ సారి వెళ్ళినప్పుడు మళ్ళీ కుమ్మేయ్యాలి.
    ————–
    Shankar : thanks for the link :-))

  9. మాదీ (ఒకప్పుడు) కాకినాడేనండి. సుబ్బయ్య హొటల్ గురించి మాకేం మిగల్చకుండా శంకర్ గారు రాసేసారుగా…:) మేము చాలా సార్లు టేస్ట్ చేసాం. మావాళ్ళ ఇంటి దగ్గరే ఉండేది. నిజం చెప్పాలంటే అదివరకూ రుచులు ఇంకా బాగుండేవి. కాని ఇప్పటికీ జనం అలాగే వస్తారు. రెండేళ్ల క్రితం కాకినాడ వెళ్ళినప్పుడు కూడా అక్కడే భోం చేసాం.

    @శంకర్: టపా పేరు చూడగానే ఇక్కడ మొదటి కామెంట్ మీదే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసా..:)

  10. subhadra says:

    రుచికరమైన వంటలకీ, మరిచిపోలేని ఆతిధ్యానికీ మారుపేరు సుబ్బయ్య గారి హోటల్. ముఖ్యంగా వారి ఏ.సీ సెక్షన్ లొ భొజనం చాలా బావుంటుంది. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఈ హోటల్ పైన టీ.వీ 9 వారు ప్రసారం చేసిన వీడియో ఇది.
    http://metroslive.com/tv9-delicious-delights-at-kakinda-subbayya-hotel/

  11. ఆరుచి,ఇంట్లోలా కొసరి కొసరి వడ్డించడం చాలా బాగుంటుంది. మనకిచ్చే బిల్లుకంటే ఎక్కువ తినేసి పోతాడేమో అనుకునే హోటళ్ళలా ఉండదు.ఏదో చుట్టాలింటికి వెల్లిన ఫీలింగ్ వస్తుంది.కాకినాడ వెళ్లినప్పుడు సుబ్బయ్య హోటల్ కి తప్పక వెళ్లి రండి.కాకినాడ గొట్టం కాజాకూడా మిస్సవ్వకండి మరి.

    • mhsgreamspet says:

      ఆత్రేయ గారు.
      వచ్చే ఆది వారం , మీ యాత్ర సుఖప్రదం కావాలని కోరుకుంటున్న.. 🙂
      చిన్ని, శేషు , మంచు , తృష్ణ , వజ్రం గారు..
      థాంక్స్ అండీ. మీ అందరి అభిప్రాయాలూ ఇంచు మించు ఒకేలా ఉండటం ఆ సుబ్బయ్య హోటల్ విశిష్టత ని చెప్పకనే చెపుతోంది.
      సుభద్ర గారు
      వీడియో లింక్ ఇచ్చినందుకు థాంక్స్ అండీ

  12. హ్మ్…నా నాలిక అసలే ఇక్కడి తిండికి చప్పబడిపోయింది. మీ అందరి మాటలని చూసి నోరూరిపోతుంది.
    ఇగో ఎవరక్కడ.. కాకినడకి రెండు ప్లేన్ టిక్కెట్లు ప్లీస్ 🙂

  13. nestam says:

    నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి.మా సుబ్బయ్యను గుర్తు చేసారు.మా ఇంట్లో అక్కలకు చెల్లెళ్ళకు ఆఖరికి నాకు కూడా ఎంగేజ్మెంట్కి సుబ్బయ్య హొటెల్ భోజనాలే.పెళ్ళివాళ్ళు తెగ ఆశ్చర్య పడేవారు వంటలు చూసి . జీడిపప్పులో కూర ఉంటుందో కూరలో జీడిపప్పు ఉంటుందో ఎవరికీ అర్ధం కాదు అంత బాగుంటాయి. ఇప్పటికీ నేను వస్తే నాన్న బుట్ట బోజనం తెప్పిస్తారు . అది కాకుండా కాకినాడ లో బిర్యాని కూడా బాగుంటుంది .మరి నాన్న ఎక్కడ తెప్పించేవారో తెలియదు .కోటయ్య కాజా కూడా.. ఏమో అండి మా కాకినాడ పేరు వింటేనే వొళ్ళు పులకరిస్తుంది

  14. jeevani says:

    ఓ ఆర్నెళ్ళ కిందట మా మిత్రుడు కూడా వెళ్ళాడు. ఆయనా అచ్చు ఇలాగే చెప్పాడు. మంచి ఆకలి మీద వెళ్ళారట. తినేసిన తర్వాత భుక్తాయాసంతో అల్లాడిపోయామన్నాడు. సుబ్బయ్య మెస్ కోసమైనా కాకినాడ వెళ్ళాలి అనిపించింది.

  15. Snkr says:

    /జీడిపప్పులో కూర ఉంటుందో కూరలో జీడిపప్పు ఉంటుందో ఎవరికీ అర్ధం కాదు అంత బాగుంటాయి. /
    నిజమే! అర్థం కానివి ఒక్కో సారి బాగుంటాయి. అర్థమయితేనే తంటా 🙂

  16. bondalapati says:

    ఎప్పుడొ పదిహేనేళ్ళ కిండట కాకినాడ లో చదువుకుంటున్నప్పుడు అక్కడ తిన్నాను.. గొప్ప హోటలే! గుర్తుచేసినందుకు థాంక్స్!

  17. bondalapati says:

    అప్పుడు యేసీ లూ టేబుళ్ళూ లేవు నేల మీద( సిరి చాప?!) కూర్చొని తినటమే!

  18. Hemadribhatla says:

    abbo kakinada abhimanulu chala mande vunnare. good good. chala baga gurtu cheseru subbaiah hotel bhojanam.

  19. Aavakaaya says:

    అసలే నేను మాంఛి భోజనం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తోంటే మీరేమో అలా ఙాపకాలని తట్టిలేపారు. పైగా ఆ లింక్ ఓపెన్ చెయ్యగానే అరిటాకు,దానిలో వంటకాలు చూసి… నా బాధ ఏమని చెప్పను లెండి?
    ఒకప్పుడు అయ్యర్ హోటల్ అని ఉండేది. టిఫిన్ లు మాత్రమే ఉండేవి అనుకుంటా దానిలో. బ్రహ్మాండం దానిలో రుచులు కూడా. ఎప్పుడయినా తిన్నారా?

    నేస్తం గారూ,

    మీది కాకినాడా?మీ రచనా శైలి చూస్తోంటే నాకు మా ఫ్రెండు గుర్తుకొస్తుంది. తనది వేట్లపాలెం కాకినాడ దగ్గర.

  20. చదువు రీత్యా కాకినాడ లో ఉండే బ్రహ్మచారులకు సుబ్బయ్య హోటల్ ఒక వరమండీ.సుబ్బయ్య హోటల్ లో కూరల పార్సిల్ సదుపాయం ఉండేది.ఏదో కాస్త అన్నం వండేసుకుని కూర పార్సిల్ తెచ్చేసుకుంటే సరిపోయేది. నాకు వైజాగ్ వెళ్ళాక ఈ డిఫరెన్స్ బాగా తెలిసింది.

  21. sugunasri says:

    సుబ్బయ్య హోటలా …ఇప్పుడు మా పుట్టింటికి అదే లాండ్ మార్క్ . నెక్స్ట్ వీక్ వెళ్తా అక్కడికి ….

  22. మీ పోస్ట్ చాలా బాగుందండి. నేను కాకినాడ వాసినేమే, ఇక్కడ కామెంట్లు కూడా బాగా నచ్చాయండి. నాకు ఒక కాకినాడ బ్లాగ్ ఉంది. మీ అంత బాగా రాయలేక పోయినా, ఏదో నాకు తోచినంత మావూరికి సంబంధించిన విషయాల గురించి బ్లాగుతూ ఉంటాను. అవకాశం వుంటే, ఒకసారి విజిట్ చేసి మీ విలువైన సలహాలు, సూచనలూ తెలియజేయండి.

    • mhsgreamspet says:

      కిషోర్ గారు..
      ధన్యవాదాలండి.. మేము కాకినాడ వాసులం కాకున్నా, ఆ ఊరన్నా, గోదావరి నీరన్నా ఎంతో ఇష్టపడతామండీ.మీ బ్లాగు చూసాను.. చాలా బాగుందండీ.

  23. DR.P.GOPICHAND says:

    I was born in Kakinada but left for Chennai in 1948 and settled here.I go to KKD every year on the way to Annavaram..Since I am away from KKD for 65 years I lost contact with many places.I knew about this hotel only now.I plan to dine there this time.
    GOPICHAND.P.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.