రైలు మెల్లగా వచ్చి ఆగింది …
ఓ బోగీలో నేను ఎక్కాను.
విభిన్న వయస్సులు…
విభిన్న జాతులు…
విభిన్న సంస్కృతులు…
విభిన్న మనస్తత్వాలు…
ఎంతో మంది మధ్య
నెమ్మదిగా నా దారి చేసుకుంటూ
నా ప్రయాణాన్ని ప్రారంభించాను…
స్టేషన్లు వస్తూనే ఉన్నాయి…
కొంతమంది దిగుతున్నారు…
కొత్తవాళ్లు ఎక్కుతున్నారు…
కాలం గడుస్తూనే ఉంది…
కాస్త భారంగా .. కాస్త దీర్ఘంగా
చూస్తుండగానే
ఎన్నో స్టేషన్లు దాటిపోయాయి…
హఠాత్తుగా ఓ క్షణం లో నాకనిపించింది
నేను ఇప్పుడు ఉన్న ఈ సమూహం
నేను ఎక్కినప్పటి సమూహం కాదు…
అది పూర్తిగా మారిపోయింది…
అందరిలో ఒంటరి భావన కలిగింది ..
భాష అదే అయినా భావం మారిపోయింది
అలంటి మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలోనే—
నా స్టేషన్ దగ్గరపడుతోందని తెలిసింది…
దిగాల్సిన సమయం ఆసన్నమైంది …
దిగేముందు
నెమ్మదిగా చుట్టూ చూసాను…
అన్ని ముఖాలు—అపరిచితంగా అనిపించాయి…
కానీ ఈ రైలు వాతావరణం మాత్రం
ఓ జ్ఞాపకాల దొంతరలా ,
అన్ని రంగులూ కలిసిన కలలా అనిపించింది…
లోతుగా ఒక శ్వాస తీసుకుంటూ
వేగంగా దగ్గరపడుతున్న నా స్టేషన్ వైపు చూస్తూ—
నాకు నేనే చెప్పుకున్నాను…
“గమ్యం కన్నా
ఈ ప్రయాణమే గొప్పది…
చివరి మజిలీ
నివారించలేనిది …”







